script src='http://www.mahigrafix.com/javascript/rainbow.js' సిరిమల్లె: నేనెందుకిలా
Showing posts with label నేనెందుకిలా. Show all posts
Showing posts with label నేనెందుకిలా. Show all posts

Tuesday, May 5, 2009

నేనెందుకిలా -2


వంటింట్లో అమ్మ హడావుడిగా ఉంది.అన్నయ్య స్నానంచేసేసి స్కూలుకు రెడీఅవుతున్నాడు.చెల్లి అమ్మ వెనుకేతిరుగుతూ ఎందుకోమారాం చేస్తూంది.నాన్న వరండాలో గ్రిల్ల్సు ప్రక్కన కూర్చుని పేపరు చదువుకొంటున్నాడు.నేను గవర్నమెంటు స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను.ఇంగ్లీషు మీడియం."బృందా! లేచావా?త్వరగా రెడీ అవ్వు.ఇప్పటికే ఆలశ్యమయ్యింది."అని నాకు చెప్పి చెల్లెలిపై కోప్పడుతూందెందుకో.అన్నయ్య ఏదోపని చేసుకొంటూ కనుకొలుకుల్లోంచీ నావైపు చూశాడు.అమ్మా నాన్నా వాడి కన్నా నన్ను బాగా చూసుకొంటారని వాడి అభిప్రాయం.అందుకే అప్పుడప్పుడూ అలా చూస్తూ ఉంటాడు. బాత్రూంవైపు పరిగెత్తాను.

స్నానంచేసియూనిఫాం వేసుకొని అన్నంతినడానికి రెడీగా డైనింగ్ టేబులు దగ్గరకు చేరాను.తొమ్మిదిన్నరకు స్కూల్లో ఉండాలి.ఈరోజు చెల్లి స్కూలుకు ఎగ్గొట్టేలా ఉంది. అది మాస్కూలులోనే నాలుగు చదువుతూంది.నాతోనేతీసుకెళతాను.ఒక రోజు వస్తే నాలుగు రోజులు రాదు.అన్నయ్య ,అన్నట్టు వాడిపేరు శివకుమార్.అందరూవాడిని శివా అని పిలుస్తారు.నాప్రక్కన కుర్చీలో వచ్చి కూర్చున్నాడు గంభీరంగా.-నేను నీకంటే పెద్ద అన్నభావం వాడి ప్రతి కదలికలోనూ కన్పింప చేస్తాడు వాడు.
పుస్తకాల సంచీతగిలించుకొని పరిగెత్తాను.మాస్కూలు నాలుగు వీధులవతల ఉంది.పెద్ద కాంపౌండులో పెద్ద బిల్డింగులో ఉంది మా స్కూలు.ఇది అమ్మాయిలకు ప్రత్యేకం.శివా, బాయిస్ స్కూల్లో చదువుతున్నాడు.కాత్యా,దీపికా,సింధుజా నా స్నేహితులు.నన్ను
స్కూలు వైపుకు లాగే అయస్కాంతాలు వాళ్ళు.ప్రేయరుముగించి ఎవరి క్లాసులకు వారు వెళ్ళి కూర్చున్నారు.మేంనలుగురం ఒకే బెంచిలో కూర్చుంటాం ఎప్పుడూ.
ఈదినచర్య ఇలాగే సాగుతుంది రోజూ.కాకుంటేచిన్న చిన్న మార్పులతో.నేనెప్పుడూ క్లాసులో ఫస్టే.మా మిస్సులు నేనెలారాసినా
మార్కులు వేస్తారేమో! సింధుజ నాకంటే బాగా చదువుతుంది .కానీమార్కులే రావెందుకో.కాత్యా,దీపికలు చదువులో కొంచెం వీక్.స్కూలు ఐపోయిన తర్వాత మేమెప్పుడూ చదువు గురించి మాటాడుకొనేవారంకాదు.అంతా ఆటలే!అప్పుడప్పుడూ సినిమా డాన్సులు కూడా వేసేవాళ్ళం.
బిజీ బిజీగా క్షణం తీరిక లేకుండా సాగిపోతున్న నా బాల్యంలో ఇంత సంతోషం దాగి ఉందని నాకు అప్పుడు తెలీలేదు.అందరికీ ఇలాగే ఉంటుందనుకొన్నాను.కానీ కొందరి బాల్యం విషాదంగాకూడా ఉంటుందని నిశ్చల పరిచయమయ్యేవరకూ నాకు తెలీనే తెలీదు.
నిశ్చ్లల మాస్కూల్లో కొత్తగా చేరింది.మాక్లాసే! మొదటి రోజే మా గ్రూపులో చేరి పోయింది.తన పేరులాగే ఆ అమ్మాయి దేనికీ తొణకదు,
బెణకదు.చాలా సైలెంటుగా ఉండేది.మాగ్రూపులోని మిగతాముగ్గురికంటే నామనసుకు బాగా దగ్గరయ్యింది నిశ్చల.అలా కాకున్నా బాగుండేదని ఇప్పుడనిపిస్తూంది............

Tuesday, April 28, 2009

నేనెందుకిలా --1


నేనెందుకిలా........
----------------

అదిగో మృత్యువు చిన్న చిన్న గా నా దరి చేరుతూంది.క్రమంగా ఊపిరి అందటం మానేస్తూంది.ఆరు దిక్కుల మద్య నేనేకాకినై మాంసపు ముద్దలా మారిపోతున్నాను.నాలుగు దిక్కులూ ,ఆకాశం,భూమి అన్నీ దగ్గరకు చేరి నన్ను మధ్యలో నలిపి వేస్తున్నాయి.యింకెంతసేపు? కొన్ని క్షణాలు.అంతే! ఆ తర్వాత?
కొన్ని వందలమంది నా చుట్టూ చేరి దుఃఖిస్తూ ఉన్నారు.కొందరైతే గుండెలు బాదుకొంటున్నారు.ఇంత ప్రేమ,ఆప్యాయతలునామీద కురుస్తున్నా నాకు తృప్తిగా
లేదు.చివరి క్షణాల్లో ఉండవల్సిన మనశ్శాంతి నాకళ్ళకు కన్పించనంత దూరం వెళిపోయింది. అదిగో నా నిర్జీవమైన శరీరాన్ని తీసికెళ్ళటానికి రధంతయారౌతూ ఉంది.బాజా భజంత్రీలు వచ్చేశాయి. ఇక నేను మరణించడమేతరువాయి.ఈ హంగామా అంతా నాకు తెలుస్తూనేఉంది.చిన్నగా కళ్ళు తిప్పి నాచుట్టూ కూర్చుని గుండెలు బాదుకొంటూ ఏడుస్తున్న వాళ్ళను చూశాను.
ఏకధాటిగా కన్నీరు కారుస్తున్న వీరి గుండెల్లో తడి ఉందా? కళ్ళు కాలవలైనప్పుడు గుండె జలాశయం కావాలి కదా! ఎండిన గుండెలనుండీ కళ్ళల్లోకి నీరెలా వస్తుంది? ఆలోచిస్తున్నాను....
ఊపిరి తీసికోవటం క్షణ క్షణానికీ కష్టమౌతూంది.......ఈచివరిక్షణాల్లో నాకెందుకింత ఆవేదన........నేనెందుకిలా.....? నా ఆలోచనలు గతాన్ని త్రవ్వుకుంటూ వెళ్ళాయి........
******** ******** ********

నా పేరు బృందావని.ఆరోజు సోమవారం.ఆదివారమంతాఆటలతో అలసిన వొళ్ళు బడలికగా కళ్ళుభారంగా,బెడ్డుమీదనుంచీలేచేందుకుఏమాత్రంసహకారంఅందించనంటున్నాయి.కుడివైపు బెడ్ మీద చూశాను .అన్నయ్య అప్పుడే లేచేసి నట్టున్నాడు.వాడికి పన్నెండేళ్ళ వయసు.ఎనిమిది చదువుతున్నాడు.
ఎడమవైపు చూశాను.బెడ్డుమీద చెల్లిలేదు.ఏమిటీ? ఇదికూడా లేచేసిందా....ఆశ్చర్యంగా గోడ కున్న గడియారం వైఫు చూశాను.ఎనిమిదయ్యింది.అయ్యో!స్కూలుకెళ్ళాలిగదా!అమ్మ కూడా
లేపలేదేమిటి చెప్మాఅనుకుంటూ ఒక్క ఉదుటునలేచాను.