script src='http://www.mahigrafix.com/javascript/rainbow.js' సిరిమల్లె: May 2009

Tuesday, May 12, 2009

నేనెందుకిలా--4


అంతే హాలంతా గందరగోళమైపోయింది.అందరూలేచి పరుగెత్తసాగారు.జనమంతా చెల్లచెదురై పోయారు.ఆతొక్కిసలాటలో ఏంజరుగుతోందోతెలీటం లేదు.ఎవరు ఎక్కడున్నారో అర్ధంకావటంలేదు.పులిపిచ్చిపట్టినట్టు నాలుగు మూలలకూ పరుగెడుతూంది.చిన్నపిల్లలు పెద్దవాళ్ళకాళ్ళక్రింద పడి నలిగిపోతున్నారు.సింధుజ నాన్నగారు సింధుజను ఎత్తుకొని బయటకు పరుగెట్టేశాడు.నేను నిశ్చల చేతిని గట్టిగా పట్టుకొన్నాను.మాప్రెండ్సందరినీ అలాగే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొమ్మని గట్టిగా అరిచి చెప్పాను.పులి అన్ని దిక్కులూతిరుగుతూ మావైపు దూసుకు రాసాగింది.అందరం పెద్దగా యేడుస్తున్నాం. జీవితంలో ఇధే ఆఖరు రోజేమో -నా మాటలు వినివీరంతా సర్కసుకు వచ్చారు.
నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.వీరిని కాపాడాలి.నాలో వెర్రి ఆవేశం ప్రవేశించింది.అంతే! ఎటువంటిపరిస్తితుల్లోను చేతులు వదలవద్దనిఅరిచి చెప్పాను.వేగంగా ద్వారం వైపు పరుగెట్టాను.సర్కసు నిర్వాహకులందరూ వలలు పట్టుకొని రంగంలోకి దిగారు.పులిని పట్టటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.మేము ఎలాగో బయట పడి పోయి టెంటుకు దూరంగా పరుగు లంకించుకొన్నాము


*** *** ***
ఆరోజు ఈవినింగ్ పేపర్లలో అంతా ఇదే న్యూసు.సర్కసు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.
అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు పిల్లలు చనిపోయారు.వింత ఏమిటంటే పులి ఒక్కరిని కూడా చంపలేదు.మా వీధంతా ఒకటే గోలగా ఉంది.
నా ఫ్రెండ్స్ పేరెంట్సు వచ్చి నాకు థాంక్సు చెప్పారు.సింధుజ తండ్రి గారిని అందరూతిడుతున్నారు,చిన్నపిల్లలను వదిలేసి తనదారిన తాను పరిగెత్తి పోయినందుకు.అతను చేసింది తప్పో రైటో అప్పుడు నాకు తెలీలేదు.ఆతర్వాత ఆవిషయం నేనాలోచించలేదు.---
రెండవరోజు స్కూలులో అంతా ఇవే కబుర్లు. టీచర్సందరూ నన్నభినందించారు.సింధుజ మాత్రం దూరదూరంగా ఉంది, బహుశా వాళ్ళ నాన్న చేసిన పనికి సిగ్గు పడుతూందేమో! కానీమేము ముందే అనుకొన్నాము సింధుజదగ్గరఎవరూ విషయంఎత్తగూడదని.సాయంత్రం అందరూఇళ్ళకు వెళ్ళేముందు సింధుజ నాదగ్గరకు వచ్చింది.దానికళ్ళు బాగా వాచి వున్నాయి.ఎర్రగా మంకెన పూవుల్లాగా ఉన్నాయి."సారీ బృందా! మానాన్న అలా చేసి ఉండ కూడదు..." ఏడుపు తో దాని గొంతు పూడుకు పోయింది.
నేను దాని భుజాలు గట్టిగా పట్టుకొని నా కేసి హత్తుకొన్నాను. ఆహా! స్నేహబంధం ఎంత మధురమైనది.నా కళ్ళల్లోంచీజారిన కన్నీరు దాని భుజాలు తడిపేసింది.ఈసంఘటన మా అందరిమధ్యన ఉన్న స్నేహ భంధాన్ని ఇంకా పటిష్టంచేసింది.
ఒక ఆదివారం నిశ్చల నన్ను వారింటికి ఆహ్వానించింది.రోజంతా ఉండేట్టు రమ్మంది.ఇంకెవ్వరినీపిలవలేదు.కానీ ఆదివారం నాజీవితగమనాన్ని మార్చివేస్తుందనీ,సాఫీగా సంతోషంగా సాగిపోతున్న నా జీవితంలో ఆలోచనా తరంగాలను రేపుతుదనీ,నిశ్చలను నా ప్రాణ సఖిని చేస్తుందనీ ఊహించలేకపోయాను.అందుకేఆ ఆహ్వానాన్ని అంగీకరించాను..........

Thursday, May 7, 2009

నేనెందుకిలా -3


అందచందాలను గురించి నాకప్పుడు పెద్దగా తెలీదు గానీ ఇప్పుడనిపిస్తూంది,నిశ్చల చాలా అందంగా ఉండేదని.
నాది సాధారణ మైన అందం అనుకొంటాను.ఆడపిల్లలు అందంగా ఉండాలని నా కప్పట్లో తెలీదు.నేనెప్పుడూ అందాలకు మెరుగులు పెట్టుకొన్న గుర్తు లేదు.నిశ్చల కూడా పెద్దగా అలంకరించుకోదు కానీ సహజంగానేఅందంగా ఉండేది.
ఓరోజు మాగ్రూపు అంతా సర్కసుకువెళ్ళాలని ప్లాను వేసుకొన్నాం.మరోఇద్దరు ఫ్రెండ్సుమాతో కలిశారు.కానీ చిన్న పిల్లలం కదా! పెద్దవాళ్ళ తోడు లేకుండా ఎలా పోవటం.అందరం ఇళ్ళల్లో మా కోరిక వెళ్ళడించాము.చివరకు సింధుజ నాన్న గారు మాతోవచ్చేట్టు నిర్ణయమైపోయింది.మేమంతా సంతోషంగా స్కూలునించీ ఇళ్ళకు చేరుకొన్నాము. ఆరుగంటలకు షో.అందరంరెడీ అయి సింధుజ ఇంటికి చేరిపోయాం. నిశ్చల కొంచెంఆలశ్యంగా చేరింది.వాళ్ళనాన్న బైకులోతీసుకువచ్చి వదలి వెళ్ళాడు.ఆరోజు నిశ్చలను చూస్తే నాకే చాలా ముచ్చటేసింది.సింపుల్ గా తయారయ్యింది కానీతీర్చి దిద్దినట్టున్న ముఖం కడిగిన ముత్యంలాగా స్వచ్చంగా ఉంది.
ఆడపిల్లలందరం రంగు రంగుల బట్టలేసుకొని గోల గోల గా సర్కసుకు బయలుదేరాం, రెండు ఆటొల్లో.శింధుజ నాన్నగారు
(పేరు సరిగా గుర్తులేదు)ఆటోడ్రైవర్లకు ఏవో ఇన్స్ట్రక్షన్లు ఇచ్చ్డాడు.ఆటోలువేగంగా దూసుకెళ్తున్నాయి.......
సర్కసు టెంటు దగ్గరకు చేరుకొన్నాము.సింధుజ నాన్నగారు కౌంటరు దగ్గరకు వెళ్ళాడు,టిక్కెట్లు తేవటానికి.
అందరం కోలాహాలంగా లోపలకు జొరబడ్డాము.హాలంతా అప్పటికేనిండి పోయి ఉంది.ముందువరసలుమాత్రం కొన్ని ఖాళీలు ఉన్నాయి.
అందరం మూడోవరసలో కూర్చున్నాము.సింధుజ నాన్నగారు చివరలో కూర్చొన్నారు.తర్వాత సింధుజ,ప్రక్కన నేను,నాప్రక్క నిశ్చలఅలా కూర్చొన్నాము.
షో ఆరంభమయ్యింది.రకరకాలవిన్యాసాలనుఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నాము.నిశ్చలయితే నాచేయి పట్టుకొనిగట్టిగా నొక్కేస్తూంది టెన్శనుతో.హాల్లోసగానికిపైగా చిన్నపిల్లలేఉన్నారు.జోకరు చేష్టలకు అందరం పెద్దగానవ్వుతున్నాము.సందడిసందడిగాఉంది. నిశ్చ్లల నాచెవి దగ్గరకు వంగి మెల్లగా చెప్పింది."థాంక్స్ బృందా! ఈప్రోగ్రామ్ పెట్టినందుకు.నాకు చాలా సంతోషంగా ఉంది."నా చేతిని ఆప్యాయం గా నొక్కింది.అంత సంతోషంలోకూడా నాకళ్ళు చెమర్చాయి.
ఒక పెద్ద ఏనుగు స్టేజీ మీదకు వచ్చింది.అది మావటి వాడు చెప్పినట్టు వింటూంది.చివర్లో నాలుగుకాళ్ళు ఒక పెద్ద బంతిమీదపెట్టి నిలబడినప్పుడుఅందరూసీట్లలోంచీలేచి చప్పట్లు కొట్టారు.అరుపులతోహాలు మార్మోగిపోయింది.కోతుల చేష్టలు సరేసరి.అందరినీ కడుపుబ్బా నవ్వించాయి.అప్పుడు ఒక పులిని స్టెజీ మీదకు తీసుకొనివచ్చారు.ఒకతను చేతిలో జాటి తో దాన్నిఅదిలిస్తున్నాడు. అతన్ని ఏమంటారో నాకు అప్పుడేకాదు,ఇప్పటికీ తెలీదు.పులి విన్యాసాలు ప్రారంభించింది.అతను చెప్పినట్టు వింటూందది.ఒక ఆడపిల్ల వచ్చి పులి నోట్లో తల పెట్టి ఒకనిమిషం సేపుంచినప్పుడు హాలంతా నిశ్శబ్ధమైపోయింది.అందరూ భయ భ్రాంతులై కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూండి పోయారు.
ఆమె తల బయటకు తివ్వగానే చప్పట్లతో హాలు మార్మ్రోగిపోయింది. సింధుజ ఒకప్రక్క,నిశ్చల మరోప్రక్కా నా చేతులు పట్టుకొని గట్టిగా నలిపివేశారు.పులి ఫీట్సు అయిపోవచ్చాయి.ఆజాటీ పట్టుకొన్నతను ప్రేక్షకులవైపు తిరిగి అభివాదం చేస్తున్నాడు.అతని వెనుక పులి నిల్చుని ఉంది.దాని కళ్ళు ఎర్రగా అగ్ని గోళాల్లాఉన్నాయి.అది నోరంతా తెరిచి భయంకరంగా అరిచిందోసారి.ఆ శభ్ధానికి హాలు దద్దరిల్లి పోయింది.పులి చెంగున ఒక్కగెంతు గెంతి క్రిందకు దూకేసి ప్రేక్షకుల్లోకి పరుగెత్తింది.......

Tuesday, May 5, 2009

నేనెందుకిలా -2


వంటింట్లో అమ్మ హడావుడిగా ఉంది.అన్నయ్య స్నానంచేసేసి స్కూలుకు రెడీఅవుతున్నాడు.చెల్లి అమ్మ వెనుకేతిరుగుతూ ఎందుకోమారాం చేస్తూంది.నాన్న వరండాలో గ్రిల్ల్సు ప్రక్కన కూర్చుని పేపరు చదువుకొంటున్నాడు.నేను గవర్నమెంటు స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను.ఇంగ్లీషు మీడియం."బృందా! లేచావా?త్వరగా రెడీ అవ్వు.ఇప్పటికే ఆలశ్యమయ్యింది."అని నాకు చెప్పి చెల్లెలిపై కోప్పడుతూందెందుకో.అన్నయ్య ఏదోపని చేసుకొంటూ కనుకొలుకుల్లోంచీ నావైపు చూశాడు.అమ్మా నాన్నా వాడి కన్నా నన్ను బాగా చూసుకొంటారని వాడి అభిప్రాయం.అందుకే అప్పుడప్పుడూ అలా చూస్తూ ఉంటాడు. బాత్రూంవైపు పరిగెత్తాను.

స్నానంచేసియూనిఫాం వేసుకొని అన్నంతినడానికి రెడీగా డైనింగ్ టేబులు దగ్గరకు చేరాను.తొమ్మిదిన్నరకు స్కూల్లో ఉండాలి.ఈరోజు చెల్లి స్కూలుకు ఎగ్గొట్టేలా ఉంది. అది మాస్కూలులోనే నాలుగు చదువుతూంది.నాతోనేతీసుకెళతాను.ఒక రోజు వస్తే నాలుగు రోజులు రాదు.అన్నయ్య ,అన్నట్టు వాడిపేరు శివకుమార్.అందరూవాడిని శివా అని పిలుస్తారు.నాప్రక్కన కుర్చీలో వచ్చి కూర్చున్నాడు గంభీరంగా.-నేను నీకంటే పెద్ద అన్నభావం వాడి ప్రతి కదలికలోనూ కన్పింప చేస్తాడు వాడు.
పుస్తకాల సంచీతగిలించుకొని పరిగెత్తాను.మాస్కూలు నాలుగు వీధులవతల ఉంది.పెద్ద కాంపౌండులో పెద్ద బిల్డింగులో ఉంది మా స్కూలు.ఇది అమ్మాయిలకు ప్రత్యేకం.శివా, బాయిస్ స్కూల్లో చదువుతున్నాడు.కాత్యా,దీపికా,సింధుజా నా స్నేహితులు.నన్ను
స్కూలు వైపుకు లాగే అయస్కాంతాలు వాళ్ళు.ప్రేయరుముగించి ఎవరి క్లాసులకు వారు వెళ్ళి కూర్చున్నారు.మేంనలుగురం ఒకే బెంచిలో కూర్చుంటాం ఎప్పుడూ.
ఈదినచర్య ఇలాగే సాగుతుంది రోజూ.కాకుంటేచిన్న చిన్న మార్పులతో.నేనెప్పుడూ క్లాసులో ఫస్టే.మా మిస్సులు నేనెలారాసినా
మార్కులు వేస్తారేమో! సింధుజ నాకంటే బాగా చదువుతుంది .కానీమార్కులే రావెందుకో.కాత్యా,దీపికలు చదువులో కొంచెం వీక్.స్కూలు ఐపోయిన తర్వాత మేమెప్పుడూ చదువు గురించి మాటాడుకొనేవారంకాదు.అంతా ఆటలే!అప్పుడప్పుడూ సినిమా డాన్సులు కూడా వేసేవాళ్ళం.
బిజీ బిజీగా క్షణం తీరిక లేకుండా సాగిపోతున్న నా బాల్యంలో ఇంత సంతోషం దాగి ఉందని నాకు అప్పుడు తెలీలేదు.అందరికీ ఇలాగే ఉంటుందనుకొన్నాను.కానీ కొందరి బాల్యం విషాదంగాకూడా ఉంటుందని నిశ్చల పరిచయమయ్యేవరకూ నాకు తెలీనే తెలీదు.
నిశ్చ్లల మాస్కూల్లో కొత్తగా చేరింది.మాక్లాసే! మొదటి రోజే మా గ్రూపులో చేరి పోయింది.తన పేరులాగే అమ్మాయి దేనికీ తొణకదు,
బెణకదు.చాలా సైలెంటుగా ఉండేది.మాగ్రూపులోని మిగతాముగ్గురికంటే నామనసుకు బాగా దగ్గరయ్యింది నిశ్చల.అలా కాకున్నా బాగుండేదని ఇప్పుడనిపిస్తూంది............